ప్రకాశం జిల్లా / ఒంగోలు : ప్రభుత్వం వచ్చే నెల 11 తేదీ నుంచి కొత్త ఇసుక విధానం అమలు చేయనున్న నేపథ్యంలో జిల్లాలో అందుకనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ తమీమ్ అన్సారియా వెల్లడించారు. ఎస్పి జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ కలిసి ప్రకాశం భవనంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందజేతకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
అప్పటి వరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉచిత ఇసుక పంపిణీకి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో మూడు స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక పంపిణీ జరుగుతుందన్నారు. బుకింగ్ కేంద్రం ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాత్రమే పనిచేస్తుందన్నారు. రాత్రివేళల్లో ఇసుక రవాణా నిషేధించామని స్పష్టం చేశారు. బుకింగ్ కోసం ట్రక్కుల్లోకి ఇసుకను లోడ్ చేసే తేదీ, సమయం పేర్కొంటూ బుకింగ్ రశీదును జారీ చేస్తామని చెప్పారు.
ఇసుక రవాణా చేసే వాహనాలు తప్పనిసరిగా ఆర్‌టిఒ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ పూర్తిగా ఉచితమని, రిజిస్ట్రేషన్ లేని వాహనాలు సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. ఇసుక రవాణాకు సంబంధించి రవాణాదారులు ఎలాంటి ఉల్లంఘనలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు. స్టాక్ యార్డు వద్ద ఎటువంటి వాహనం అనవసరంగా వేచి ఉండకుండా చూస్తామని చెప్పారు. ఇసుక కార్యకలాపాలను ఎలాంటి ఆటంకాలు లేకుండా పర్యవేక్షించేందుకు స్టాక్‌యార్డులకు సమీపంలో రెవెన్యూ, పోలీస్ తదితర శాఖల ఉద్యోగులతో కూడిన ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టు పాయింట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.