ఇండియా అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంట్‌ను ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో ఆదివారం జరిగిన గ్రూప్-ఎ లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటగా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (74 బంతుల్లో 8 ఫోర్లతో 59), కెప్టెన్ ప్రియం గార్గ్ (72 బంతుల్లో 2 ఫోర్లతో 56) భారీ స్కోర్ అందించగా.. ఆకాశ్ సింగ్, సిద్ధేశ్ వీర్ లంక పతనాన్ని శాసించారు.
టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 297 పరుగులు చేసింది. యశస్వీ జైస్వాల్, కెప్టెన్ ప్రియం గార్గ్ భారత ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేయగా.. చివర్లో ధ్రువ్ జురెల్ (48 బంతుల్లో 52 నాటౌట్ 3 ఫోర్లు, సిక్స్), సిద్ధేశ్ వీర్ (27 బంతుల్లో 44 నాటౌట్ 6 ఫోర్లు, సిక్స్) ధాటిగా ఆడారు. ఇక హైదరాబాదీ క్రికెటర్ తిలక్ వర్మ (53 బంతుల్లో 3 ఫోర్లతో 46) మెరిశాడు.298 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక 45.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. లంక కెప్టెన్ నిపున్ ధనంజయ (50; 2 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీ చేయగా.. రవీందు రసంత (49; 5 ఫోర్లు), కామిల్ మిషారా (39) రాణించారు. లంక మిగతా బ్యాట్స్‌మన్ విఫలమయ్యారు. భారత బౌలర్లలో ఆకాశ్ సింగ్ (2/29), సిద్ధేష్‌వీర్ (2/34), రవి బిష్ణోయ్ (2/44) తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన సిద్ధేష్ వీర్ ‘ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్’గా నిలిచాడు. భారత అండర్-19 జట్టు తదుపరి మ్యాచ్‌ను మంగళవారం జపాన్‌తో ఆడనుంది. ఆదివారం జరిగిన మరో మ్యాచ్‌లో స్కాట్లాండ్ అండర్-19 జట్టుపై పాకిస్థాన్ అండర్-19 జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదటగా స్కాట్లాండ్ 23.5 ఓవర్లలో 75 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం పాక్ 11.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference