బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ అసెంబ్లీ రెడీ అవుతోంది. ఈ నెల ఆరో తేదీ నుంచి శాసనసభ, శాసన మండలి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్టు ప్రభుత్వం నిన్న ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ రోజున ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడంతో సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఏడో తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ఉంటుంది. 8న బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. హోలీ సందర్భంగా 9న సెలవు. తిరిగి 10 లేదంటే 11వ తేదీల్లో సమావేశాలు తిరిగి ప్రారంభం అవుతాయి. శాసన మండలి సమావేశాలు నాలుగు రోజులే జరగనుండగా, శాసనసభ సమావేశాలు మాత్రం ఈ నెల 24 వరకు జరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, గవర్నర్‌గా తమిళిసై నియమితులైన తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు ఇవే కావడం గమనార్హం.