సాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ స్పందించారు. మంద కృష్ణ నేతృత్వంలోని మహాజన సోషలిస్టు పార్టీ కూడా సాగర్ బరిలో అభ్యర్థిని నిలపగా, కేసీఆర్ తో కుమ్మక్కై మంద కృష్ణ ఈ నిర్ణయం తీసుకున్నారని విపక్షాలు ఆరోపించాయి.దీనిపై మంద కృష్ణ మాట్లాడుతూ…. సీఎం కేసీఆర్ దళితులను సీఎం చేస్తానంటూ మోసం చేశారని, ఆయన చేసిన అన్యాయాన్ని ఎదుర్కొనడానికే సాగర్ బరిలో మహాజన సోషలిస్టు పార్టీ అభ్యర్థి పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేతప్ప కేసీఆర్ తో తనకు ఎలాంటి లోపాయికారీ ఒప్పందం లేదని స్పష్టం చేశారు. సాగర్ లోనే కాదు, ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో వెనుకబడిన వర్గాలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ను ఎదుర్కోవడంలో విపక్షాలు వైఫల్యం చెందాయని మంద కృష్ణ విమర్శించారు.