భారతదేశంలో ముస్లింలు చాలా సంతోషంగా ఉన్నారని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఓ హిందీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. దేశ సంస్కృతిపై దాడి జరిగిన ప్రతిసారీ అన్ని మతాల ప్రజలు ఏకతాటిపై నిలబడి దేశాన్ని రక్షించుకున్నారని ప్రశంసించారు.ఇక ప్రపంచంలోని మరే దేశంలోనూ లేనంతగా ముస్లింలు ఇక్కడ సంతోషంగా ఉన్నారని అన్నారు. పాకిస్థాన్‌లో ఇతర మతాల వారికి హక్కులు ఉండవని అన్నారు. మేవార్ రాజు మహారాణా ప్రతాప్ సైన్యంలో అనేక మంది ముస్లింలు మొఘల్ సామ్రాజ్యాధిపతి అక్బర్ చక్రవర్తికి వ్యతిరేకంగా పోరాడారని భగవత్ గుర్తుచేశారు.ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలని మన రాజ్యాంగం చెప్పలేదని అన్నారు. అయితే, ఇకపై మాత్రం ఇక్కడ ఉండాలంటే హిందువుల ఆధిపత్యాన్ని అంగీకరించాల్సిందేనని తేల్చి చెప్పారు. ముస్లింలకు కూడా ప్రత్యేకంగా చోటు కల్పించామని, భారతదేశ స్వభావానికి అది ప్రతీక అని పేర్కొన్నారు. స్వాభివిక స్వభావాన్నే హిందూగా పిలుస్తారని భగవత్ అభివర్ణించారు. తమ స్వార్థ ప్రయోజనాలకు విఘాతం కలిగిన వారే దురభిమానాన్ని, వేర్పాటువాదాన్ని వ్యాప్తి చేస్తున్నారని భగవత్ మండిపడ్డారు.