గ్రేటర్ ఎన్నికల ప్రచారం ఈ నెల 29న ముగుస్తోంది. ప్రచారపర్వంలో అధికార టీఆర్ఎస్ కు దీటుగా బీజేపీ దూసుకుపోతోంది. పలువురు బీజేపీ జాతీయ నాయకులు నగరానికి వచ్చి ప్రచారం చేశారు. మరోవైపు 29న ప్రధాని మోదీ కూడా హైదరాబాదుకు వస్తున్నారు. ప్రచారపర్వం ముగియడానికి సరిగ్గా 50 నిమిషాల ముందు ఆయన నగరానికి చేరుకుంటారు. అంతేకాదు ప్రచారం ముగిసిన 10 నిమిషాలకే ఆయన తిరుగుప్రయాణం కానున్నారు.అయితే, మోదీ హైదరాబాదుకు వస్తున్నది ఎన్నికల ప్రచారం కోసం కాదనే విషయం గమనార్హం. 29 సాయంత్రం 4.10 గంటలకు హైదరాబాదు శివార్లలో ఉన్న హకీంపేట విమానాశ్రయానికి మోదీ వస్తారు. అక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్ బయోటెక్ సంస్థ వద్దకు చేరుకుంటారు. అక్కడ కరోనా వ్యాక్సిన్ తయారీని ఆయన పరిశీలిస్తారు. అనంతరం సాయంత్రం 5.10 గంటలకు హకీంపేట చేరుకుని, అక్కడి నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్తారు. అయితే అదేరోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.