లాక్ డౌన్ 3.0 ఈ నెల 17తో ముగియనుండగా, ఆ తరువాత కరోనా ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగిస్తూ, మిగతా ప్రాంతాల్లో మరిన్ని నిబంధనలను తొలగించేందుకే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. నిన్న దాదాపు 6 గంటల పాటు ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించగా, అన్ని రాష్ట్రాల సీఎంలూ పాల్గొని కరోనా కట్టడి, నిబంధనల అమలుపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాత్రిపూట కర్ఫ్యూ, ప్రజా రవాణా రద్దు తదితర ఆంక్షలు రెడ్ జోన్లలో మాత్రమే ఉంటాయని, ఈ విషయంలో మే 15లోగా అభిప్రాయాలను తెలపాలని రాష్ట్రాలను కోరినట్టు తెలిపాయి. “ఇప్పటివరకూ చేసిందాన్నే కొనసాగించాలని భావిస్తున్నాను. తొలి దశ లాక్ డౌన్ నిబంధనలను రెండో దశలో సడలించాం. రెండో దశలోని కొన్ని నిబంధనలను మూడో దశలో సడలించాం. అదే విధంగా నాలుగో దశ లాక్ డౌన్ లోనూ పాటించాలి” అని ఈ వీడియో కాన్ఫరెన్స్ తరువాత విడుదల చేసిన మీడియా ప్రకటనలో నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఇక రెడ్ జోన్ నిబంధనలను జిల్లాల స్థాయిలో కాకుండా, కంటైన్ మెంట్ జోన్ల స్థాయిలోనే ఉండేలా చూడాలని కూడా పలు రాష్ట్రాలు మోదీకి విజ్ఞప్తి చేశాయి.