ఇండియా టెలికం రంగంలో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో, తాజాగా మరో బంపరాఫర్ ను ప్రకటించి, పోటీలో ఉన్న ఇతర టెల్కోలకు షాక్ ఇచ్చింది. అతి త్వరలోనే తాము రూ.1,999 ధరలో కొత్త మొబైల్ ఫోన్ ను విడుదల చేస్తున్నామని ప్రకటించింది. అంతే కాదు, ఆ ఫోన్ కొనుగోలు చేసేవారికి రెండు సంవత్సరాల పాటు ఉచిత కాల్స్ ఇస్తామని చెప్పింది. అంతేకాకుండా, నెలకు 2 గిగాబైట్ల డేటాను ఉచితంగా వాడుకోవచ్చని, రెండేళ్లలో మొత్తం 48 జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో రూ. 1,499 ధరలో మరో ఫోన్ ను విడుదల చేస్తున్నామని, ఈ ఫోన్ తో ఏడాది పాటు అపరిమిత కాల్స్, నెలకు 2 జీబీ డేటాను పొందవచ్చని పేర్కొంది. ఇక ఇప్పటికే జియో అందిస్తున్న ఫీచర్ ఫోన్ ను వాడుతున్న వినియోగదారులు, రూ. 749తో రీచార్జ్ చేసుకుంటే, రెండేళ్లు అమలులో ఉండే ఇవే ఆఫర్లు పొందవచ్చని వెల్లడించింది.