శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వడం ద్వారా వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవచ్చని వైద్య నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. ప్రధానంగా, తగినంత సమయం నిద్రకు కేటాయిస్తే, అలసిన శరీరం సాంత్వన పొందుతుంది. తాజాగా ఓ హెల్త్ జర్నల్ లోనూ ఇదే అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. కంటినిండా నిద్రపోవడం వల్ల కరోనా వైరస్ ను సైతం ఎదుర్కొనే శక్తి శరీరానికి లభిస్తుందట. ఇమ్యూనిటీ పెరగడం వల్ల కరోనా క్రిములు మానవ కణాలపై ఏమంత ప్రభావం చూపలేవని సదరు అధ్యయనంలో స్పష్టం చేశారు. నిద్రలేమి వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గడమే కాదు, కరోనా బారిన పడే అవకాశాలు మరింత పెరుగుతాయని పరిశోధకులు వివరించారు. అమెరికా, ఫ్రాన్స్, యూకే, జర్మనీ, స్పెయిన్, ఇటలీ వంటి దేశాల్లో నిద్రాహారాలకు దూరమై కరోనా రోగుల చికిత్సలో అధిక సమయం గడిపిన ఆరోగ్య సిబ్బందిపై ఈ మేరకు ఓ సర్వే నిర్వహించారు. వారిలో అత్యధికులు కరోనా బారినపడినట్టు గుర్తించారు. విధి నిర్వహణ సమయంలో వారు ఎంతసేపు నిద్రించారన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. కరోనా బారినపడిన ఆరోగ్య సిబ్బందిలో 40 శాతం మంది సరైన నిద్రలేకపోవడం, మానసిక ఒత్తిళ్లతో బాధపడుతూ కరోనా బారినపడ్డారని తెలుసుకున్నారు. సగటున రోజూ నిద్రించే సమయం కంటే ఒక గంట అదనంగా నిద్రించినా అది శరీరానికి ఎంతో శక్తినిస్తుందని, ఆ గంట నిద్రతో కరోనా సోకే అవకాశాలు 12 శాతం తగ్గుతాయని వివరించారు. మానసిక ఒత్తిళ్లతో బాధపడేవారిలో వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతుందని, తద్వారా వారిలో కరోనా వైరస్ ప్రవేశించడానికి ఎంతో సులువు అవుతుందని బీఎంజే న్యూట్రిషన్ ప్రివెన్షన్ అండ్ హెల్త్ అనే జర్నల్ లో పేర్కొన్నారు.