కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనే వ్యాక్సిన్ ఇంకా రాకపోవడంతో ఇతర ఔషధాలపై ప్రపంచ దేశాలు ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మలేరియా చికిత్సలో దివ్యౌవషధంగా భావించే హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్ఐవీ రోగులకు ప్రాణాధారంగా భావించే లోపినావిర్-రిటోనావిర్ ఔషధాలను కూడా కరోనా చికిత్సలో ఉపయోగిస్తున్నారు. అయితే, ఈ మందుల సమర్థత కరోనా రోగులపై ఏమేరకు పనిచేస్తుందన్నదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నేతృత్వంలో పరిశోధనలు నిర్వహిస్తున్నారు.అయితే, ఆయా మందులు కరోనా చికిత్సలో ఏమంత ప్రభావశీలంగా పనిచేయడంలేదని డబ్ల్యూహెచ్ఓ గుర్తించింది. కొన్ని కేసుల్లో ఆ మందుల ప్రభావం ఏమాత్రం లేదని తేలడంతో, పరిశోధనలను ఇంతటితో ఆపేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా, కరోనా బాధితులను మరణం నుంచి కాపాడడంలో ఇవి వైఫల్యం చెందాయని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే, హోం క్వారంటైన్ లో ఉన్నవారికి, వైరస్ రాకుండా ముందు జాగ్రత్తగా మందులు తీసుకోవాలనుకునే వారికి ఇవి ఏమేరకు ఉపయోగపడతాయన్నదానిపై పరిశోధనలు కొనసాగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.