ఆయన పేరు అనుపమ్ మిశ్రా. కేరళలోని కొల్లాం సబ్ కలెక్టర్. ఇటీవలే ఆయన సింగపూర్ పర్యటన చేసి ఇండియాకు వచ్చారు. నిబంధనల ప్రకారం, ఆయన్ను క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు అనుపమ్ మిశ్రా కనిపించలేదు. ఆయనకు ఫోన్ చేయగా, తన స్వగ్రామమైన కాన్ పూర్ లో ఉన్నానని సమాధానం ఇవ్వడంతో కొల్లాం కలెక్టర్ అబ్దుల్ నాసర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.ఓ బాధ్యతాయుతమైన అధికారి క్వారంటైన్ నుంచి తప్పించుకోవడంతో ఇతర అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అబ్దుల్ నాసర్ ఆదేశాలతో అనుపమ్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. కాగా, క్వారంటైన్ లో ఉన్న ఆయనకు సరైన ఆహారం పెట్టడం లేదని, ఈ కారణంతోనే ఆయన స్వస్థలానికి వెళ్లిపోయారని కొందరు అధికారులు వ్యాఖ్యానించడం గమనార్హం.