ఆంధ్రప్రదేశ్ : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. లారీని కారు బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. మరణించిన నలుగురిలో ఇద్దరు చిన్నారులు ఉండడం చూపరులను కలచివేసింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని ఆసుపత్రికి తరలించారు. కాగా, మరణించినవారు విశాఖకు చెందినవారిగా భావిస్తున్నారు.
అటు, తెలంగాణలో నాగర్ కర్నూలు జిల్లాలో కారు బోల్తా పడిన ఘటనలో ముగ్గురు బలయ్యారు. స్నేహితుడి పెళ్లికి వెళ్లి వస్తూ తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. అరవింద్, శిరీష, రేణుక, కిరణ్మయి హైదరాబాదులోని ఓ కాలేజీలో చదువుకుంటున్నారు. వీరంతా నల్గొండ జిల్లాకు చెందినవారు కాగా, హైదరాబాదులో హాస్టల్ లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నారు.
అయితే, స్నేహితుడి పెళ్లి కోసం వెల్దండ వెళ్లారు. వేడుకలు ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ వస్తుండగా… నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్తాల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పింది. కారులో ఉన్న శిరీష, కిరణ్మయి, అరవింద్ ఘటనస్థలంలోనే మరణించారు. రేణుక గాయపడింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల మరణవార్తతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం నెలకొంది.