ఎపి వైసీపీ ప్రభుత్వంపై మావోయిస్టు నేత, ఆంధ్రా-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేశ్ మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ప్రజలకు ఒరిగిందేమీ లేదంటూ మీడియాకు లేఖ పంపారు. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ కేంద్రానికి తాకట్టు పెట్టేశారని ఆ లేఖలో గణేశ్ ఆరోపించారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్రం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక వాదులు, లౌకికవాదులు గొంతెత్తితే రాజద్రోహం కేసులుపెట్టి జైళ్లలో నిర్బంధిస్తోందని అన్నారు. జగన్ దీనికి మద్దతు ప్రకటిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను విమర్శిస్తున్న మీడియాను సైతం జగన్ వదిలిపెట్టకుండా పత్రికా స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వ వ్యతిరేక, నిరంకుశ విధానాలపై పోరాడేందుకు అందరూ ముందుకు రావాలని ఆ లేఖలో గణేశ్ పిలుపునిచ్చారు.