నా కొడకా.. నీ కాళ్లు, చేతులు నరుకుతా. చంపేస్తా’… సంతోశ్ అనే జర్నలిస్టుపై పటాన్ చెరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. దీనికి సంబంధించిన ఆడియో బయటకు రాగానే… ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ మరియు జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి.అంతేకాదు, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో మహిపాల్ రెడ్డి వెనక్కి తగ్గారు. జర్నలిస్టులంటే తనకు ఎంతో గౌరవం ఉందని ఆయన అన్నారు. భూకబ్జాలతో తనకు సంబంధం లేదని చెప్పారు. తన పరువుకు భంగం కలిగించేలా వార్తలు రాశారని, వార్తలు రాసేముందు తన వివరణ తీసుకుని ఉంటే బాగుండేదని అన్నారు.తన గురించి తప్పుడు వార్త రాశాడంటూ సంతోశ్ పై మహిపాల్ రెడ్డి రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాళ్లు, చేతులు నరుకుతానంటూ ఆయన అందుకున్న తిట్ల దండకం… జర్నలిస్టులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. ఆయన తీరును జర్నలిస్టు సంఘాలు తప్పుపట్టాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో, ఆయన క్షమాపణ చెప్పారు.