కొవిడ్-19 వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆర్థిక వ్యవస్థకు చాలా తీవ్రమైన సవాళ్లు ఉన్నాయని తెలిపారు. ఆర్థిక ఏడాది ద్వితీయార్థం నుంచి ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. టర్మ్ లోన్లపై మారటోరియం మరో 3 నెలలు పొడిగింపు ఇస్తున్నట్లు తెలిపారు. జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు టర్మ్ లోన్లపై మారటోరియం పొడిగిస్తున్నట్లు వివరించారు.కరోనా వ్యాప్తి కట్టడి ఆధారంగానే ఆర్థిక కార్యకలాపాల భవిష్యత్తు ఆధారపడి ఉందని వివరించారు. అయితే, ఈ పరిస్థితులు వ్యవసాయ రంగానికి మాత్రం మరింత ప్రోత్సాహకంగా ఉన్నాయని చెప్పారు. ఆహారధాన్యాల ఉత్పత్తి పెరుగుతోందని తెలిపారు.డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని తెలిపారు. భారత విదేశీ మారక నిల్వలు 487 బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం తగ్గిందని వివరించారు. మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడిందని తెలిపారు.తక్కువ ధరలో రుణాలు, వడ్డీరేట్లు తగ్గాయని, దీంతో సామాన్యుడికి లాభం చేకూరుతుందని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుదేలవడంతో ఇది పెట్టుబడులపై తీవ్ర పరిణామం చూపిస్తోందని తెలిపారు ద్రవ్యోల్బణాన్ని పూర్తిగా కట్టడి చేస్తామని ఆయన చెప్పారు. 13 నుంచి 32 శాతం మేర ప్రపంచ వాణిజ్యం తగ్గిందని తెలిపారు. కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని చెప్పారు. రెపోరేటును 4.40 నుంచి 4 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. రివర్స్ రెపో రేటు 3.2 శాతానికి తగ్గించినట్లు చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో మరిన్ని నిధులను అందుబాటులో ఉంచేందుకే రెపోరేటు తగ్గించామని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం అంచనా వేయడం క్లిష్టంగా మారిందన్నారు. సమీప భవిష్యత్తులో ద్రవ్యోల్బణం లాక్డౌన్ నిబంధనల అమలుపై, కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్లపై ఆధారపడి ఉండొచ్చని తెలిపారు.