contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

తొలిసారి రోదసిలోకి ఒక తెలుగు మహిళ

తొలిసారి రోదసిలోకి ఒక తెలుగు మహిళ విజయవంతంగా అడుగుపెట్టారు. ఈ చరిత్రాత్మకయానం భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమైంది. నిజానికి ఈ రోదసియానం సాయంత్రం 6.30కి మొదలు కావాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఇది మొదలైంది. ఈ యాత్రలో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన బండ్ల శిరీష అంతరిక్ష సంస్థ వర్జిన్ గెలాక్టిక్‌కు చెందిన మానవ సహిత వ్యోమ నౌక వీఎస్ఎస్ యూనిటీ-22లో రోదసిలోకి వెళ్లారు. వర్జిన్ గెలాక్టిక్ యజమాని, బ్రిటన్ వ్యాపారవేత్త సర్ రిచర్డ్ బ్రాన్సన్‌తో పాటు బండ్ల శిరీష, మరో నలుగురు ఈ రోదసియానం చేశారు. వర్జిన్ గెలాక్సీ ఈ ఈవెంట్‌ను ఆన్‌లైన్ స్ట్రీమింగ్ చేసింది. నేల నుంచి దాదాపు 88 కి.మీ. ఎత్తుకు చేరుకున్నాక, నాలుగైదు నిమిషాలపాటు వ్యోమగాములు భారరహిత స్థితికి లోనయ్యారు. ఆ సమయంలో యూనిటీ-22 కిటికీల గుండా బయట పరిస్థితులను వారు వీక్షించారు. జీవితాంతం గుర్తుపెట్టుకోగలిగే తీపి అనుభూతులను ఈ యాత్రను తనకు ఇచ్చిందని రిచర్డ్ బ్రాన్సన్‌ చెప్పారు. ”ఈ యాత్ర కోసం చిన్నప్పటినుంచీ ఎన్నో కలలు కన్నాను. అంతరిక్షం నుంచి భూమిని చూడటం నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా ఏదో మాయాజాలంలా అనిపించింది”అని యాత్ర అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. రిచర్డ్ బ్రాన్సన్ తన ఈ కలల ప్రాజెక్టును ఇంతవరకు తీసుకురావడం వెనుక ఎంతో కృషి ఉంది. స్పేస్ ప్లేన్ తయారుచేయాలన్న తన కోరికను ఆయన 2004లో బయట ప్రపంచానికి వెల్లడించారు. 2007 నాటికి వాణిజ్యపరమైన స్పేస్ సర్వీసెస్ అందించాలని ఆయన ఆశించారు. కానీ, సాంకేతిక అవరోధాల కారణంగా అది అనుకున్న సమయానికి సాధ్యపడలేదు. 2014లో ఆయన ప్రయత్నం విఫలమైన స్పేస్ ఫ్లైట్ కూలిపోయింది. ”నాకు చిన్నప్పటి నుంచి కూడా అంతరిక్షంలోకి వెళ్లాలన్నది కోరిక. వచ్చే వందేళ్లలో లక్షల మంది ప్రజలు స్పేస్‌లోకి వెళ్లగలిగేలా చేయాలన్నది నా కోరిక” అని ‘బీబీసీ’తో చెప్పారు బ్రాన్సన్. ”ఈ విశ్వం అత్యద్భుతమైనది. అంతరిక్షం అసాధారణమైనది. ప్రజలు ఎందుకు అంతరిక్షంలోకి ప్రయాణించకూడదు? ప్రజలు అంతరిక్షంలోకి వెళ్లి అక్కడి నుంచి అందమైన భూమిని చూడగలిగి తిరిగి భూమిని చేరుకోవాలి” అన్నారాయన. ఇది ఎలా పనిచేస్తుందంటే… ఈ యాత్రలో భాగంగా యూనిటీ అని పిలిచే వాహక నౌకను వీఎంఎస్ ఈవ్ అనే ప్రత్యేక విమానం భూమి నుంచి 15 కిలో మీటర్ల(50 వేల అడుగుల) ఎత్తుకు తీసుకెళ్లి విడిచిట్టింది. అప్పుడు యూనిటీకి అమర్చిన రాకెట్ మోటార్‌ను ప్రజ్వలింపజేశారు. మోటార్ 60 సెకండ్లపాటు మండింది. ఆ సమయంలో రిచర్డ్ బ్రాన్సన్, తన ముగ్గురు క్రూ సహచరులు, ఇద్దరు పైలట్లు అక్కడి నుంచి భూమిని చూడగలిగారు. అనంతరం అంతరిక్షంలోకి యూనిటీ ప్రయాణం సాగింది. యూనిటీ గరిష్ఠంగా భూమి నుంచి 88 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఆ ఎత్తుకు వెళ్లాక రిచర్డ్ బ్రాన్సన్ భార రహిత స్థితిలో క్యాబిన్‌లో కొద్ది నిమిషాలు తేలుతూ కిటికీలోంచి చూశారు. తిరిగి తన సీటులోకి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి న్యూమెక్సికోలోని స్పేస్‌పోర్ట్‌కు చేరుకునేందుకు తిరుగు ప్రయాణం మొదలైంది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :