ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి, పేదలకు సాయం చేయడానికి తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఇప్పటికే ఎంతో మందికి అండగా నిలిచిన కేటీఆర్… తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఐఐటీలో చదువుతున్న పేద విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా హసన్ పర్తికి చెందిన మేకల అంజలి ఇండోర్ ఐఐటీలో తొలి సంవత్సరం పూర్తి చేసుకుని ద్వితీయ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అయితే తన కుటుంబ ఆర్థిక స్థితి కారణంగా తన చదువును కొనసాగించలేని పరిస్థితి తలెత్తింది. ఆమె తండ్రి ఆటోడ్రైవర్ గా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో, తనకు సాయం చేయాలని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ ను అంజలి గత ఏడాది కోరింది. ఆమె విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కేటీఆర్… గత ఏడాది ఆమెకు ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు ఆమె రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో… ఈ ఏడాది ఖర్చులకు సరిపడా డబ్బును ఆయన అందజేశారు. ఫీజులు, ల్యాప్ లాప్ నిమిత్తం రూ. 1.5 లక్షలను ప్రగతిభవన్ లో అందజేశారు. తమకు అండగా ఉన్న కేటీఆర్ కు ఈ సందర్భంగా అంజలి, ఆమె కుటుంబసభ్యులు కృతజ్ఞతలను తెలియజేశారు.