తమిళనాడులోని తూత్తుకుడిలో ఇద్దరు తండ్రీకొడుకులు పోలీసు కస్టడీలో మరణించిన ఘటన దేశవ్యాప్తంగా కదలిక తీసుకుచ్చింది. ఈ ఘటనపై తమిళనాడు అట్టుడుకుతున్న సమయంలోనే ఇలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ ఆటో డ్రైవర్ ను పోలీసులు తీవ్రంగా కొట్టడంతో , తీవ్రగాయాలపాలైన ఆ డ్రైవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.తిరునల్వేలి ప్రాంతానికి చెందిన కుమరేశన్ ఆటో నడుపుకుంటూ కుటుంబ పోషణ సాగిస్తున్నాడు. ఓ భూ వివాదంలో కుమరేశన్ ను పోలీసులు రిమాండ్ లో ఉంచారు. విచారణ జరిపే క్రమంలో అతడిని బాగా కొట్టడంతో తీవ్రగాయాల పాలయ్యాడు. రిమాండ్ ముగిశాక ఇంటికి వెళ్లగా, కుమరేశన్ కనీసం మాట్లాడలేని పరిస్థితిలో ఉండడం గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు.అయితే, పరిస్థితి విషమించి కుమరేశన్ కన్నుమూశాడు. కిడ్నీలు దెబ్బతినడం వల్లే మరణించాడని వైద్యులు తెలిపారు. పోలీసులు ఇష్టంవచ్చినట్టు కొట్టడం వల్లే తమ బిడ్డ మరణించాడని కుమరేశన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు, వారు ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై, కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. ఈ ఘటన కూడా తమిళనాడులో తీవ్ర ఆగ్రహావేశాలు కలిగిస్తోంది.