బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇప్పటికే ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియతో పాటు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన విషయం తెలిసిందే. అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్, గుంటూరు శ్రీను మాత్రం పరారీలో ఉన్నారు. అఖిలప్రియ మూడు రోజుల పోలీసుల కస్టడీలో భాగంగా జరిపిన విచారణలో పలు విషయాలను పోలీసులు రాబట్టారు.ఈ కేసులో భార్గవ్‌రామ్ తల్లి కిరణ్మయితో పాటు ఆయన సోదరుడు చంద్రహాస్లకూ సంబంధం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. రిమాండ్ నివేదికలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. అలాగే, ఈ కిడ్నాప్ కేసులో అఖిలప్రియ సోదరుడి ప్రమేయంపై విచారణ జరుపుతున్నారు. పోలీసుల విచారణలో ఈ కేసుతో తనకు సంబంధం లేదంటూ అఖిలప్రియ చెప్పుకొచ్చారు.ఈ కేసులో తాను జైల్లో ఉంటే లాభం లేదని పోలీసులతో వాదించారు. బోయిన్ పల్లి కిడ్నాప్‌కు సూత్రధారిని తానేనంటూ ప్రచారం చేస్తున్నారని, అలాంటప్పుడు తాను బయట ఉంటేనే మిగిలిన నిందితులకు నచ్చజెప్పి పోలీసుల ముందు లొంగిపోయేలా చేస్తానని, ఇందుకు అవకాశమివ్వాలని ఆమె కోరినట్టు సమాచారం.హఫీజ్ పేట భూముల విషయంలో పూర్తిగా విచారణ జరిపితే ఆ విలువైన భూములు ఎవరివో తెలుస్తాయని, ఆ భూములు తన తండ్రివని ఆమె తెలిపారు. విచారణలో భాగంగా ఆమె పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేదు. మరోవైపు, అరెస్టయిన నిందితులు సంపత్‌కుమార్, మల్లికార్జునరెడ్డి, బాలచెన్నయ్యలను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.