ఇప్పటికే పలు ప్రముఖ పారిశ్రామిక సంస్థలు తమ యూనిట్లను తెలంగాణలో నెలకొల్పగా.. తాజాగా ఎస్ త్రీవీ అనే సంస్థ సంగారెడ్డిలోని మెడికల్ డివైజెస్ పార్కులో తన ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పే నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ముందు ఓ ప్రతిపాదనను పెట్టింది. ఈ మేరకు గురువారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఎస్ త్రీవీ సంస్థ ప్రతినిధులు.. సంగారెడ్డి మెడికల్ డివైజెస్ పార్కులో తమ ఉత్పత్తి ప్లాంట్‌ను నెలకొల్పనున్నట్లుగా ప్రకటించారు.
న్యూరో, కార్డియాలజీ వైద్య చికిత్సల్లో భాగంగా వినియోగించే న్యూరో మెడికల్ డివైజెస్, నెక్ట్స్ జనరేషన్ ఎల్యూటింగ్ స్టెంట్, డ్రగ్ కోటెడ్ క్రిటికల్ కేర్ క్యాథరర్స్‌ను ఎస్ త్రీవీ సంస్థ ఉత్పత్తి చేయనుంది. రూ.250 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న తమ ఉత్పత్తి ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా మరో 250 మందికి ఉపాధి లభించనుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.