సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ సంస్థ నుంచి ఏకంగా రూ.30 లక్షలు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హంగేరీకి చెందిన ఓ కంపెనీ పేరుతో ఇండియా మార్ట్ సైట్‌లో ఓ ప్రకటన వెలువడింది. హోల్‌సేల్ ధరలకే మాస్కులు, గ్లౌజులు అందిస్తామని అందులో పేర్కొంది. ఇందుకు సంబంధించి ఓ కొటేషన్ కూడా ఉంచింది. గ్లౌజులు, మాస్కులు హోల్‌సేల్‌గా విక్రయించే జూబ్లీహిల్స్‌లోని ఓ సంస్థ ఈ కొటేషన్ చూసి హంగేరీ సంస్థను సంప్రదించింది.కొటేషన్లు ఇచ్చిపుచ్చుకున్న అనంతరం హంగేరీ కంపెనీ ప్రతినిధిగా చెప్పుకునే ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా అగ్రిమెంట్ పంపించి సరుకు పంపాలంటే తొలుత రూ. 30 లక్షలు బదిలీ చేయాలన్నాడు. నమ్మిన సదరు సంస్థ ఆ కంపెనీ చెప్పిన ఖాతాకు ఆ మొత్తాన్ని బదిలీ చేసింది. ఆ తర్వాత గడువు ముగిసినా సరుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన సంస్థ తమకు పరిచయమైన వ్యక్తికి ఫోన్ చేసేందుకు ప్రయత్నించగా స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో మోసపోయినట్టు గ్రహించిన సంస్థ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.