గల్ఫ్ దేశాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. ఇరాక్, ఇరాన్ పరిధి గగనతలంలోకి వెళ్లొద్దని విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. దీంతో భారత విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిపెట్టినట్లు సమాచారం. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుపై అమెరికా రాకెట్ దాడులు చేసిన అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు, ప్రతిదాడులు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే విమానయాన సంస్థలకు భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇరక్, ఇరాన్ గగనతలానికి దూరంగా ఉండాలని సూచించింది. వీటి వల్ల విమానయాన సంస్థలపై అదనపు భారం పడనుంది.
‘ఇరాక్‌లో చో్టు చేసుకున్న పరిణామాల దృష్ట్యా భారత ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చేవరకు భారతీయులు ఆ దేశానికి వెళ్లవద్దని సూచిస్తున్నాం. ఇరాక్‌లో ఇప్పటికే నివసిస్తోన్న వారు ఆ దేశంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలి’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.బాగ్దాద్‌లోని భారత దౌత్య కార్యాలయ సిబ్బంది ఇరాక్‌లో ఉంటోన్న భారతీయులకు అన్ని రకాలుగా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని రవీశ్ కుమార్ వివరించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇటీవలే భారత్ విమానయాన సంస్థలకు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. వారం రోజుల్లో రెండో సారి భారత విమానయాన శాఖ హెచ్చరిక చేసింది. మరోవైపు ఇరాన్, ఇరాక్ గగన తలాలపై విమానాల ప్రయాణాన్ని అమెరికాతో పాటు పలు దేశాలు కూడా నిషేధించాయి.