వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ స్పందించారు. వైసీపీ ఫిర్యాదును లోక్‌సభ సచివాలయం పరిశీలిస్తోందని తెలిపారు. పద్ధతి ప్రకారమే విచారణ జరిపి నిర్ణయమే తీసుకుంటామని అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాత ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. జగన్ బెయిల్ రద్దు కోసం న్యాయపోరాటం చేస్తున్న రఘురామకృష్ణంరాజు లోక్‌సభ సభ్యత్వం రద్దు చేయించేలా స్పీకర్‌పై ఒత్తిడి తీసుకురావాలని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం ఎంపీ రఘురామకృష్ణరాజుపై అనర్హత వేటు వేయాలని కోరుతూ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఆ పార్టీ ఎంపీలు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. నేరుగా వైసీపీ ఎంపీలు విజయసాయి, మిథున్ రెడ్డి, భరత్ స్పీకర్ ను మరోసారి కలిశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారని మరిన్ని ఆధారాలను స్పీకర్ కు అందజేశారు. వెంటనే రఘురాజుపై అనర్హత వేటు వేయాలని కోరారు. అయితే స్సీకర్ ను కలిసి తరువాత మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రఘురామ తీరుపై ఫైర్ అయ్యారు. వైసీపీ టికెట్ మీద గెలిచి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు రఘురాజు పాల్పడుతున్నారని స్పీకర్ కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గతంలో కూడా దీనికి సంబంధించిన ఆధారాలను స్పీకర్‌కు అందించామని తెలిపారు.
అయితే ఈ విషయంలో స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది క్రితం నుంచి ఆయనపై అనర్హత వేటు పరిశీలన జరుగుతూనే ఉందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ననుసరించి రఘురామపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఎలా అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన స్పీకర్ కార్యాలయం.. ఈ అంశంపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.