హైదరాబాదులో రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా, రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈసారి జీహెచ్ఎంసీ బరిలో 150 డివిజన్లకు గాను 1,122 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రేటర్ లో మొత్తం ఓటర్ల సంఖ్య 74,67,256. ఇక, పోలింగ్ కోసం 9,101 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 28,683 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు.జీహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 డీఆర్సీ కేంద్రాల ద్వారా పోలింగ్ సామగ్రి పంపిణీ చేయనున్నారు. బ్యాలెట్ బాక్సుల పంపిణీ మాత్రమే కాకుండా, డీఆర్సీ కేంద్రాల నుంచే స్ట్రాంగ్ రూములు, కౌంటింగ్ కేంద్రాల నిర్వహణ కూడా చేపట్టనున్నారు.కాగా, జీహెచ్ఎంసీ పోలింగ్ సందర్భంగా 2,336 సున్నితమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 1,207 అతి సున్నితమైన, 279 అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలుగా ఎస్ఈసీ గుర్తించింది. పలు కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు.జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 50 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. భద్రతాపరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సుమారు 50 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. జోన్ల వారీగా ఐపీఎస్ అధికారులను, డివిజన్ల వారీగా ఇన్చార్జి ఏసీపీ, సీఐలను నియమించారు.