హీరో అజిత్ సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని అనేక సందర్భాల్లో నిరూపితమైంది. హైదరాబాదులో ఓ ఇడ్లీ బండి వ్యక్తి ఆర్థిక పరిస్థితి పట్ల స్పందించిన అజిత్ అతడికి రూ.1 లక్ష సాయం అందించినట్టు తాజాగా వెల్లడైంది. అజిత్ ప్రస్తుతం వినోద్ దర్శకత్వంలో వాలిమై చిత్రంలో నటిస్తున్నారు. స్వతహాగా బైక్ రేసర్ అయిన అజిత్ ఇందులో తనకిష్టమైన రేసర్ పాత్రనే పోషిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో జరిగిన సమయంలో షూటింగ్ స్పాట్ కు దగ్గర్లో ఉన్న ఇడ్లీ బండి వ్యక్తిని ప్రతిరోజూ గమనించి అజిత్ అతడి పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చారు.తక్కువ ధరలోనే రుచికరమైన ఇడ్లీలు అందిస్తూ కుటుంబ పోషణ సాగిస్తున్న ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఏమంత సజావుగా లేదని తెలుసుకుని, అతడికి సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. కుమార్తె చదువుకోసమే ఇడ్లీ బండి పెట్టుకుని అంత కష్టపడుతున్నాడని గుర్తించిన అజిత్ పెద్దమనసుతో రూ.1 లక్ష రూపాయలు అందించారు. ఈ విషయం ఆలస్యంగా వెల్లడైంది. ఏదేమైనా అజిత్ మంచితనానికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురుస్తోంది.