రోడ్లు రద్దీగా ఉన్నా కొందరు ఆకతాయిలు బైకులపై స్టంట్లు చేస్తూ వచ్చిపోయేవారిని భయపెడుతుంటారు. ఇప్పుడు వారికి మరికొందరు యువకులు ఆటోలతో తోడయ్యారు. రద్దీగా ఉన్న రోడ్డుపై మూడు ఆటోలతో ప్రమాదకర స్టంట్లు చేస్తూ ఇతర వాహనదారులను భయపెట్టారు. ఆటోలను ఓవైపు వంచేసి రెండు టైర్లపై నడుపుతూ హంగామా చేశారు. ఈ ఘటన హైదరాబాద్ చాంద్రాయణగుట్ట పరిధిలో మొన్న అర్ధరాత్రి జరిగింది.
ఆ స్టంట్లను వీడియో తీసి ఓ నెటిజన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు. ప్రమాదకర విన్యాసాలు చేసిన ఆరుగురిని నిన్న అరెస్ట్ చేశారు. రెండు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఆకతాయి యువకుడు పరారీలో ఉన్నాడు.
కాగా, టోలీచౌకీకి చెందిన సయ్యద్ జుబేర్ అలీ (20), సయ్యద్ సాహిల్ (21), మహ్మద్ ఇబ్రహీం (22), మహ్మద్ ఇనాయత్ (23), గులాం సైఫుద్దీన్ (23), మహ్మద్ సమీర్ (19), అమీర్ ఖాన్ (20) అనే యువకులు ఆటోలను అద్దెకు తీసుకుని నడుపుతుంటారని, గురువారం అర్ధరాత్రి బాబానగర్ నుంచి డీఆర్డీఎల్.. మళ్లీ అక్కడి నుంచి బాబానగర్ కు వస్తూ విన్యాసాలు చేశారని పోలీసులు తెలిపారు. ఇబ్రహీం పరారీలో ఉన్నాడని, మిగతా అందరినీ రిమాండ్ కు తరలించామని చెప్పారు.
Action required @HYDTP !#Santoshnagar#Chandrayangutta !! pic.twitter.com/oruw79VacZ
— Dr Chaitanya Singh (@MidnightReportr) February 25, 2022