రాజధాని అమరావతిలో తనకు భూములు ఉన్నాయంటూ ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చేసిన వ్యాఖ్యలను రావెల కిశోర్ బాబు మరోమారు ఖండించారు. వెలగపూడిలో రాజధాని రైతులు చేస్తున్న రిలే దీక్షలకు రావెల సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని, రాజధాని రైతులు భయపడాల్సిన అవసరం లేదని భరోసా కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ఏపీ రాజధాని పేరేంటో చెప్పలేని స్థితికి వచ్చామని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా పేరు చెబితే జగన్ గుండెల్లో గుబులు పట్టుకుంటుందని అన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేయాలన్న ఆలోచన సబబు కాదని అభిప్రాయపడ్డ రావెల, పార్టీలపై కక్ష ఉంటే రాజకీయపోరాటం చేయాలే తప్ప ఇలా ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు దిగొద్దని హితవు పలికారు.