అమెరికాలో మరో ముగ్గురు భారతీయులకు కీలక పదవులు లభించనున్నాయి. ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ వారిని నామినేట్ చేశారు. ఇందులో అత్యంత కీలకమైన న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు జడ్జి పదవి కూడా ఉంది. ఈ పదవికి ప్రముఖ మహిళా న్యాయవాది సరిత కోమటిరెడ్డిని ట్రంప్ ఇప్పటికే నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ట్రంప్ ప్రతిపాదించిన మిగతా ఇద్దరిలో భారతీయ అమెరికన్ న్యాయవాది అశోక్ మైఖేల్ పింటో, భారతీయ అమెరికన్ సీనియర్ దౌత్యవేత్త మనీషా సింగ్ ఉన్నారు. అశోక్ మైఖేల్ పింటోను ప్రపంచ బ్యాంకులో రుణాలు అందించే విభాగమైన అంతర్జాతీయ పునర్నిర్మాణ, అభివృద్ధి బ్యాంకుకు అమెరికా ప్రతినిధిగా నామినేట్ చేయగా, పారిస్ కేంద్రంగా పనిచేసే ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ)కి తన రాయబారిగా మనీషా సింగ్‌ను ట్రంప్ నామినేట్ చేశారు.