- బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్, పోచారం, గుత్తాలే కారణమని ఆరోపణ
- టీడీపీ దయాదాక్షిణ్యాలతో కేసీఆర్ రాజకీయ మనుగడ సాగించాడన్న రేవంత్
- బొజ్జల ఆర్థిక సాయంతోనే కేసీఆర్ పార్టీ పెట్టారని వ్యాఖ్య
తెలంగాణ సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రా నేతల ఆర్థిక సహకారంతోనే కేసీఆర్ పార్టీని పెట్టారని, చంద్రబాబు చెప్పులు మోశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గాంధీ భవన్ లో ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, కౌన్సిల్ చైర్మన్, అసెంబ్లీ స్పీకర్‌లు రాజకీయాలు మాట్లాడటంపై కూడా విమర్శలు గుప్పించారు.
టీడీపీ దయాదాక్షిణ్యాలతో రాజకీయ మనుగడ
బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్, పోచారం, గుత్తాలు కారణమని ఆరోపించారు. టీడీపీలో నాడు రైతు వ్యతిరేక నిర్ణయాలు చేసింది కేసీఆరేనన్నారు. తెలంగాణ మంత్రులు విద్యుత్ విషయంలో వితండవాదం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2009కి ముందు టీడీపీపై రంకెలు వేసిన కేసీఆర్ ఆ తర్వాత అదే పార్టీతో పొత్తు పెట్టుకొని.. తెలుగుదేశం దయాదాక్షిణ్యాలతో రాజకీయాల్లో మళ్లీ మనుగడ సాగించారన్నారు. అప్పుడే కేటీఆర్ టీడీపీ సహకారంతో సిరిసిల్లలో చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా 150 ఓట్ల మెజార్టీతో గెలిచారన్నారు. ఇదీ మీ చరిత్ర… ఓ పక్క టీడీపీ, మరోపక్క కాంగ్రెస్ పార్టీతో మీరు బతికారని, పరాన్నజీవులని ధ్వజమెత్తారు. ఆ పార్టీలతో బతికి.. అదే పార్టీలను తిట్టే నీచ సంస్కృతి మీది అన్నారు.
మంత్రి పదవి కోసం కేసీఆర్ నాడు చంద్రబాబు చెప్పులు మోశారన్నారు. బొజ్జల గోపాలకృష్ణరెడ్డి ఆర్థిక సాయంతోనే కేసీఆర్ పార్టీ పెట్టారని షాకింగ్ కామెంట్స్ చేశారు. అంటే ఆంధ్రా వాళ్ల డబ్బుతోనే కేసీఆర్ తెలంగాణ కోసం పార్టీ పెట్టారన్నారు. అప్పట్లో చంద్రబాబు అపాయింటుమెంట్ కోసం కేసీఆర్ వేమూరి రాధాకృష్ణ సహా పలువురిని బతిమిలాడారని ధ్వజమెత్తారు.
రాజకీయాలు మాట్లాడవచ్చా?
శాసన సభ స్పీకర్ పోచారం, కౌన్సిల్ చైర్మన్ సుఖేందర్ రెడ్డిలు రాజకీయాలు మాట్లాడవచ్చా? అని రేవంత్ ప్రశ్నించారు. రాజకీయాలు మాట్లాడటమే కాకుండా.. ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. వారికి వయసు, ఒళ్లు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదన్నారు. స్వామిగౌడ్ లాంటి వారిని చూసి నేర్చుకోవాలన్నారు. పోచారం తన కొడుకు అక్రమ దందాలు, కేసుల నుండి తప్పించుకోవడానికి కేసీఆర్ చెప్పులు మోస్తున్నారని, బూట్లు నాకుతున్నారని ధ్వజమెత్తారు. నీకు సిగ్గుందా? అని అడుగుతున్నానని.. స్పీకర్ గా ఉండి కేసీఆర్ బూట్లు నాకే పరిస్థితి ఎందుకు వచ్చిందని దుయ్యబట్టారు.
సుఖేందర్ రెడ్డి మూలన పడితే టీడీపీ, ఆ తర్వాత కాంగ్రెస్ ఆయనకు జీవం పోశాయన్నారు. కొడుకుకు టిక్కెట్ కోసం కౌన్సిల్ చైర్మన్ పదవిని తాకట్టు పెట్టారన్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి నిన్ను బండకేసి కొట్టారని, ఇప్పుడు కొడుకు టిక్కెట్ కోసం పదవిని తాకట్టు పెడతావా? అని ప్రశ్నించారు. పోచారం, గుత్తాలను రైతు కులం నుండి బహిష్కరించాలని, గవర్నర్ వారిని బర్తరఫ్ చేయాలన్నారు. వీరు పార్టీలకు ద్రోహం చేశారని, నమ్మిన నాయకులను మోసం చేశారని, ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నారన్నారు. కొడుకుల కోసం ఇంతగా దిగజారుతారా? అని ప్రశ్నించారు.