తాజాగా పాక్ తన భూభాగం పైనుంచి భారత్ లోకి ఓ డ్రోన్ ను ప్రయోగించింది. శనివారం రాత్రి గ్రనేడ్లతో కూడిన డ్రోన్ ను పంపింది. ఈ డ్రోన్ ను గుర్తించిన భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) దానిపై తూటాల వర్షం కురిపించింది. అయితే ఆ డ్రోన్ తప్పించుకోవడంతో బీఎస్ఎఫ్ అధికారులు పంజాబ్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు కాల్పులు జరిపినా ఆ డ్రోన్ ను కూల్చలేకపోయారు. పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా సరిహద్దుల వద్ద ఈ ఘటన జరిగింది. అయితే, డ్రోన్ జారవిడిచిన ఓ పెట్టెను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది 11 హ్యాండ్ గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్రనేడ్లను పాకిస్థాన్ లోని రావల్పిండిలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారుచేసినట్టు భావిస్తున్నారు. భారత్ లోకి ఇలాంటి ఆయుధాలను అక్రమ రవాణా చేసే ప్రయత్నం జరగడం గడచిన 15 నెలల్లో ఇది ఎనిమిదోసారి అని అధికారులు తెలిపారు.
