టోల్ ట్యాక్స్ చెల్లించనందున పల్లెలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సు టోల్‌గేట్ వద్దనే ఆగిపోయింది. ఫలితంగా గ్రామీణులు ఇబ్బందులపాలయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ధర్మారం టోల్‌గేట్ వద్ద బాన్సువాడ నుంచి పెద్దకొడప్‌గల్, బేగంపూర్, కాస్లాబాద్, వడ్లం, గ్రామాలకు వెళ్లాల్సిన ఆర్టీసీ బస్సును టోల్‌గేట్ సిబ్బంది మంగళవారం ఉదయం నిలిపివేశారు. దీంతో బస్సు వెనక్కి తిరిగి వెళ్లిపోయింది.
ఆయా గ్రామస్తులు పలువురు ఆర్టీసీ అధికారులను సంప్రదించగా ప్రయాణికుల నుంచి టికెట్ చార్జీలు ట్రిప్పుకు రూ.200 నుంచి రూ.400 వసూలు అవుతుందని, టోల్ ట్యాక్స్ ట్రిప్పుకు రూ.480 ఉండటంతో నష్టం వస్తోందని తెలిపారు. రోజుకు మూడు ట్రిప్పులు బస్సును నడపలేకపోతున్నామన్నారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజలు వెళ్లి టోల్‌గేట్ అధికారులతో మాట్లాడాలని, ట్యాక్స్ మినహాయింపు ఇస్తే బస్సులు నడుపుతామని డిపో మేనేజర్ సాయన్న తెలిపారు. ఈ విషయాన్ని ఎమ్యెల్యే హన్మంత్ సింధే దృష్టికి తీసుకువెళ్తామన్నారు.