భద్రతా పరికరాల కొనుగోలులో ఉద్దేశపూర్వకంగా ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించి వ్యవహరించారని ఆరోపిస్తూ ఏపీ ప్రభుత్వం తనపై వేసి సస్పెన్షన్ వేటుపై మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి ఎ.బి.వెంకటేశ్వరరావు స్పందించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అక్రమాల కారణంగానే తనపై చర్యలు తీసుకున్నారని మీడియాలో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదని చెప్పారు. ఈ చర్యతో మానసికంగా తనకు వచ్చిన ఇబ్బంది ఏమీలేదన్నారు. అందువల్ల బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరారు. ప్రభుత్వం తదుపరి చర్య ఏమిటన్నది త్వరలో తెలుస్తుందని, ఈ వ్యవహారంలో తాను చట్టపరంగా ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు.