యుక్రెయిన్‌లో రష్యా రక్తపాతం సృష్టిస్తోంది. సరిహద్దు దాటి యుక్రెయిన్‌లోకి ప్రవేశించిన రష్యా బలగాలు దాడులతో విరుచుకుపడుతున్నాయి.
సైనిక, వైమానిక, ఓడరేవులు, కీలక, వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా రష్యన్ సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు యుక్రెయిన్‌కు చెందిన 83 సైనిక స్థావరాలను.. 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఓ సైనిక హెలికాప్టర్‌తో పాటు నాలుగు డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు తెలిపింది. తూర్పు యుక్రెయిన్‌లోని నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా… పశ్చిమ యుక్రెయిన్‌లోని నగరాలపై వైమానిక దాడులతో నిప్పుల వాన కురిపిస్తోంది. కీవ్‌లోని యుక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపైనా క్రెమ్లిన్ దళాలు దాడిచేశాయి. దీంతో ఎయిర్ రెయిడ్ సైరన్ల శబ్దాలతో ప్రధాన నగరాలు మార్మోగిపోతున్నాయి.
ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్ ప్రయత్నాలతో.. ఇరువైపులా ప్రాణనష్టం సంభవించింది. మొత్తంగా ఇప్పటివరకు వంద మందికిపైగానే మృతి చెందినట్లు తెలుస్తోంది. 40 మందికిపైగా తమ సైనికులు 10 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. ఒడెస్సాలోనే 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 50మంది రష్యా ఆక్రమణదారులను చంపినట్లు యుక్రెయిన్ ప్రకటించుకుంది. 7 రష్యా విమానాలు, ఓ హెలికాఫ్టర్‌ను కూల్చేసినట్లు వెల్లడించింది. అయితే… తమ యుక్రెయిన్ ప్రకటనను రష్యా తోసిపుచ్చింది. తమ వారెవరూ చనిపోలేదని… ముగ్గురికి మాత్రం గాయాలయ్యాయని ప్రకటించింది.