మంచిర్యాల జిల్లా, చెన్నూరు: ఈ నెల 28న లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మాక్స్ కేర్ మరియు రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రి వారి సహకారంతో చెన్నూరు పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హలులో నిర్వహించబోయే ఉచిత మెగా హెల్త్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సుగుణాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా హెల్త్ క్యాంపుకు సంభందించిన గోడ ప్రతులను మహేశ్వరి సమాజ్ నాయకులతో కలిసి ఆయన విడుదల చేశారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలు దాదాపు 210 దేశాలలో కొనసాగుతున్నాయని, చెన్నూరు పట్టణ కేంద్రంగా గత కొద్ది రోజుల క్రితం 350మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నెల 28న నిర్వహించబోయే ఉచిత మెగా హెల్త్ క్యాంపు సేవలు ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని, రానున్న రోజుల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరిన్ని సేవలు అందిస్తామని సుగుణాకర్ రెడ్డి అన్నారు. అనంతరం లయన్స్ క్లబ్ గర్మిళ్ల మంచిర్యాల అధ్యక్షుడు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్ మాట్లాడుతూ, వృత్తిరిత్యా జిల్లా కేంద్రంలో ఉంటున్నప్పటికీ స్వగ్రామమైన చెన్నూరుకు ఏదైనా చేయాలనే సదుద్దేశ్యంతో గత కొద్ది రోజులుగా చెన్నూరు పట్టణ కేంద్రంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, అందులో భాగంగా 350 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు సైతం నిర్వహించమని, ఈ నెల 28న కూడా పట్టణంలోని సాయిరాం ఫంక్షన్ హలులో మాక్స్ కేర్ మరియు రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రి వారి సహకారంతో నిర్వహించబోయే ఉచిత మెగా హెల్త్ క్యాంపును మారుమూల ప్రాంత ప్రజలు కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇందులో భాగంగా ఉచిత మందులు కూడా పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరి సమాజ్ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ లాహోటి, సభ్యుడు నారాయణ ముందడా, పట్టణ వైద్యుడు శంకర్ లాల్ లాహోటి, లయన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షుడు డాక్టర్ లయన్ రాకేష్, కోశాధికారి లయన్ శంకర్ లింగం, జాడి తిరుపతి, వెంకటనర్సయ్య, నిమ్మల సాగర్ తదితరులు పాల్గొన్నారు.