ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఎండీగా ఆర్.పి.ఠాకూర్ నిన్న పదవీ విరమణ చేయడంతో సీనియర్ ఐపీఎస్ అధికారి సీహెచ్ ద్వారకా తిరుమలరావును ప్రభుత్వం ఆయన స్థానంలో నియమించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. 1989 బ్యాచ్‌కు చెందిన ద్వారకా తిరుమలరావు ప్రస్తుతం రైల్వే విభాగం డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. గతంలో ఆయన విజయవాడ సీపీగా పనిచేశారు.
ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండీగా, ప్రజా రవాణా విభాగం కమిషనర్‌గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. శిక్షణ విభాగం అదనపు డీజీగా ఉన్న ఎన్. సంజయ్‌ని ఏపీ పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఎండీగా నియమించారు. అలాగే, సిబ్బంది, శిక్షణ విభాగం అదనపు డీజీగా కూడా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.