కడప జిల్లా పోరుమామిళ్ల అటవీ రేంజ్ లో 23ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వారి నుంచి కారు, మోటారు సైకిళ్లను టాస్క్ ఫోర్సు పోలీలసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ కే.చక్రవర్తి ఆదేశాల మేరకు ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ రాఘవేంద్ర టీమ్ పోరుమామిళ్ల అటవీ రేంజ్ లోని టేకూరు పేట మీదుగా కవలకుంట్ల ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. సోమవారం ఉదయం కొమ్మినేని రాస్తా ఎడమ వైపు ఒక కారు, మోటారు సైకిల్ నిలిపి ఉన్నారు. అక్కడకు వెళ్ల చూడగా, కారులో దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. దీంతో వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా, దుంగలను పడేసి పారిపోయారు. అయితే వారిలో ఐదుగురి పట్టుకోగలిగారు. వారిని పోరుమామిళ్ల టౌన్ కు చెందిన పాలగిరి నాగార్జున (32), పెద్దేటి నాగరాజు (35), గుజ్జుల వెంకటేశ్వర్లు (42), చినమల వెంకటయ్య (62), పులివెందులకు చెందిన నీరెద్దుల ప్రకాష్ (20)లుగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్సు పోలీసు స్టేషన్ లో నమోదు చేయగా, సీఐ బాలకృష్ణ దర్యాప్తు చేస్తున్నారు.