contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ఎల్ఏసీకి 20 కి.మీ. దూరంలో చైనా బలగాలు, ట్యాంకులు – సరిహద్దులో గరం గరం

 

నీతి వాక్యాలు వల్లిస్తూనే… భారత్ ను ఢీకొనేందుకు చేయాల్సిందంతా చేస్తోంది చైనా. తూర్పు లడఖ్ ప్రాంతంలోని వాస్తవాధీనరేఖ అవతల… భారీ ఎత్తున యుద్ద ట్యాంకులను, సైనికులను మోహరింపజేసి మన దేశాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. వాస్తవాధీనరేఖకు 20 కిలోమీటర్ల దూరంలో వీటిని మోహరించింది. దక్షిణ ప్యాంగాంగ్ లోని  మాల్డో ప్రాంతంలో మన సైనికులకు కనిపించేంత దూరంలో చైనా బలగాలు ఉన్నాయని విశ్వసనీయ సమాచారం. ఎత్తైన ప్రాంతంలో మోహరించిన చైనా ట్యాంకులు రెండు కిలోమీటర్లకు పైగా రేంజ్ లో దాడి చేయగలవు.ఈ నేపథ్యంలో, ఇండియన్ ఆర్మీ సైతం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతంలోకి అదనపు ట్యాంకులను, సైన్యాన్ని పంపించింది. మన బలగాలు, ట్యాంకులు సైతం ఎత్తైన ప్రాంతంలో ఉంటూ, చైనా నుంచి ఎదురయ్యే దాడిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. చైనా ట్యాంకుల దాడిని ఎదుర్కొనేందుకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్, రాకెట్స్ తో పాటు పలు రకాల ఆయుధాలతో మన సైనికులు రెడీగా ఉన్నారు. అప్ గ్రేడెడ్ టీ-72ఎం1 ట్యాంకులతో పాటు, మిస్సైల్స్ ను ఫైర్ చేయగలిగిన హెవీ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ టీ-90లను ఎల్ఏసీ వద్ద మోహరింపజేశారు. ఇవన్నీ కూడా హై ఆల్టిట్యూడ్ ఏరియా (ఎత్తైన ప్రాంతాలు)లపై ఉండి, శత్రువులపై విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉన్నాయి.ప్రస్తుతం ఇరు దేశాల సైన్యం మోహరించిన విధానాన్ని చూస్తే… మనల్ని చైనా ఢీకొనే పరిస్థితి లేదు. అయినప్పటికీ, చైనా దూకుడుగా వ్యవహరించే ప్రయత్నం చేస్తోంది. చైనా సైన్యం మొత్తం మన ఆయుధాల రేంజ్ లోనే ఉన్నట్టు అధికారులు తెలిపారు. మంచు పర్వతాల మధ్య మనతో చైనా సైనికులు పోటీ పడలేరని చెప్పారు. ఇదే సమయంలో చైనా ఎయిర్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగడం గమనార్హం. ఎల్ఏసీకి అవతల చైనా ఎయిర్ యాక్టివిటీ ఎక్కువగా కనపడుతోంది. చైనా దేశీయంగా తయారు చేసిన సుఖోయ్-30 యుద్ధ విమానాలు టిబెట్ ప్రాంతంలోని రెండు ఎయిర్ బేస్ ల నుంచి చక్కర్లు కొడుతున్నాయి. తద్వారా మన ఎయిర్ ఫోర్స్ కు సవాల్ విసిరే ప్రయత్నం చేస్తున్నాయి.ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్ నరవాణే మాట్లాడుతూ, సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందని స్పష్టం చేశారు. టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పారు. మన వైపు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని… ఎల్ఏసీ పొడవునా అవసరమైన అన్ని చోట్ల బలగాలను, ఆయుధాలను మోహరింపజేశామని తెలిపారు. చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.ఇంకోవైపు, చైనా దూకుడు నేపథ్యంలో, నార్త్ ఇండియాలోని అన్ని ఎయిర్ బేసుల్లో హైఅలర్ట్ జారీ చేశారు. అన్ని బేసుల్లో యుద్ద విమానాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఎల్ఏసీ పొడవునా మన యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. రానున్న రోజుల్లో ఈ పరిస్థితి యుద్ధానికి దారి తీస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

 Don't Miss this News !

Share :