ఆంధ్రప్రదేశ్‌లో 24 గంటల్లో మరో 41 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ప్రకటన చేసింది. ‘రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు జరిగిన కొవిడ్-19 పరీక్షల్లో గుంటూరులో 16, కృష్ణలో 8, కర్నూలులో 7, అనంతపురంలో 2, నెల్లూరులో ఒక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 34 కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473 కి పెరిగింది’ అని తెలిపింది. రాష్ట్రంలోని నమోదైన మొత్తం 473 పాజిటివ్ కేసులకు గాను 14 మంది డిశ్చార్జ్ కాగా, తొమ్మిది మంది మరణించారని ప్రభుత్వం తెలిపింది. మృతుల్లో అనంతపురం వాసులు ఇద్దరు, కృష్ణా జిల్లాకు చెందిన ముగ్గురు, గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు, కర్నూలుకు చెందిన ఒకరు, నెల్లూరులో ఒకరు ఉన్నారని చెప్పింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2,010 శాంపిళ్లను పరీక్షించగా 41 పాజిటివ్ గా నిర్దారించబడ్డాయని తెలిపింది. కాగా, గుంటూరులో ఇప్పటివరకు అత్యధికంగా 109 మందికి కరోనా సోకింది. ఆసుపత్రుల్లో మొత్తం 450 మందికి చికిత్స అందుతోంది.