కరోనా మహమ్మారి అగ్రరాజ్యం అమెరికాను కుదిపేస్తోంది. వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశంగా ఉన్న అమెరికా.. మరణాల సంఖ్యలో రెండో స్థానానికి చేరుకుంది. కరోనా మరణాల్లో ఆ దేశం స్పెయిన్‌ను దాటేసింది. అమెరికాలో ఇప్పటిదాకా 14,797 మంది చనిపోయారు. దాంతో, 14,792 మరణాలతో ఉన్న స్పెయిన్‌ను యూఎస్‌ఏ మూడో స్థానానికి నెట్టింది. 17,669 మరణాలతో ఇటలీ మొదటి స్థానంలో ఉంది. అగ్రరాజ్యంలో ప్రస్తుతం 4,35,160 కేసులు నమోదవగా.. స్పెయిన్‌లో 1,48,220 మంది వైరస్ బారిన పడ్డారు.అమెరికాలో బుధవారం ఒక్కరోజే 1973 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. యూఎస్‌ఏలో ఒక్క రోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. మంగళవారమే 1939 మంది చనిపోగా.. 24 గంటల్లోనే ఆ రికార్డు బ్రేక్ కావడం శోచనీయం. గురువారం కొత్తగా 233 పాజిటివ్ కేసులతో పాటు 9 మంది చనిపోవడంతో మరణాల్లో స్పెయిన్‌ను దాటేసింది. ఈ రెండు దేశాల తర్వాత ఇటలీలో 1,39,422 మందికి కరోనా సోకింది. కానీ ఆ దేశంలో అత్యధికంగా 17,669 మంది చనిపోయారు. ఫ్రాన్స్‌లో మరణాల సంఖ్య పది వేలు దాటింది. ఆ దేశంలో లక్షా 12 వేల మంది వైరస్ బారిన పడ్డారు. ఇక, జర్మనీలో లక్ష పైచిలుకు (1,13,296) కేసులు నమోదైనప్పటికీ మరణాల సంఖ్య తక్కువగా ఉంది. ఆ దేశంలో ఇప్పటిదాకా 2349 మంది చనిపోయారు..