కరోనా ప్రభావం చారిత్రక స్థలాలపైనా పడింది. తెలంగాణలో నేటి నుంచి గోల్కొండ కోట, చార్మినార్ తో పాటు వరంగల్ కోటలను మూసివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే జూ పార్కు, లుంబినీ, ఎన్టీఆర్ పార్కులు, ప్రదర్శనశాలలు మూతపడిన సంగతి తెలిసిందే. పర్యాటక శాఖ అధీనంలోనే ఉన్న వరంగల్ రామప్ప దేవాలయం, వేయి స్తంభాల గుడి, జోగులాంబ దేవాలయాలను మాత్రం మూసే పరిస్థితి లేకపోవడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో గుమికూడకుండా చూసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇక ఈ సంవత్సరం శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలో స్వామివారి కల్యాణం అర్చకులకు మాత్రమే పరిమితం కానుంది. ఏటా భక్తుల జయజయధ్వానాల మధ్య వేడుకగా జరిగే కల్యాణం, ఆలయ చరిత్రలో తొలిసారిగా అత్యంత నిరాడంబరంగా, పూజారులు, ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుంది. ఇక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించే ఉగాది వేడుకలనూ నియంత్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రగతి భవన్ లో జరిగే ఉగాది కార్యక్రమాలకు సందర్శకులను అనుమతించరాదని భావిస్తున్నారు.