హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి సమీపంలోని జవహర్ నగర్ పరిధిలో మూడు మృతదేహాలు బయటపడటం కలకలం రేపింది. ఇక్కడి డెంటల్ కాలేజీ పక్కనే ఉన్న డంపింగ్ యార్డు సమీపంలో ఓ మర్రిచెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతూ కనిపించగా, ఆ పక్కనే మరో చిన్నారి విగతజీవిగా పడివుండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఘటనా స్థలికి చేరుకుని దర్యాఫ్తు చేపట్టారు. మరణించిన వారు ఎవరన్న విషయాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. వీరిది ఆత్మహత్యా లేక ఎవరైనా చంపేవారా? అన్న కోణంలో విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కరోనాపై భయంతో ప్రజలంతా లాక్ డౌన్ ను పాటిస్తున్న వేళ, ఇటువంటి విషాదం జరగడంపై స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.