ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకో కొత్త వార్త వస్తోంది. వైరస్ పై జరుగుతున్న అధ్యయనాల్లో కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు మరో కొత్త విషయాన్ని వెల్లడించారు. ఈ వైరస్ మహిళల కంటే పురుషులకే ఎక్కువగా సోకుతోందట. మెనోపాజ్ కు చేరిన మహిళలు కూడా… వారి వయసులో ఉన్న పురుషులతో పోలిస్తే కరోనా బారిన తక్కువగా పడుతున్నారు. దీంతో, పురుషులకే వైరస్ ఎక్కువగా ఎందుకు సోకుతోందనే విషయంపై కూడా తాజాగా అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. స్త్రీలలోని ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్లు వారి పాలిట రక్షణ కవచంలా ఉంటున్నాయా? అనే విషయంపై కూడా పరిశోధకులు దృష్టిని సారించారు. తమ పరిశోధనల్లో భాగంగా న్యూయార్క్ లోని లాంగ్ ఐలాండ్ లో వైరస్ సోకిన పురుషులకు రోగనిరోధక శక్తిని పెంచే క్రమంలో ఈస్ట్రోజెన్స్ హార్మోన్ ను ఇస్తున్నారు. లాస్ ఏంజెలెస్ లో మరికొందరికి వచ్చేవారం ప్రొజిస్టిరాన్ హర్మోన్ ఇవ్వబోతున్నారు. ఈ పరిశోధనల వల్ల ఉపయోగం ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.