ఈ ఒక్క నెలలోనే ఏడు మిస్సైల్స్‌ను పరీక్షించగా.. తాజాగా ఉత్తర కొరియా జరిపిన భారీ క్షిపణి ప్రయోగం గురించి ప్రపంచమంతా చర్చ నడుస్తోంది. కారణం.. గత ఐదేళ్లలో నార్త్ కొరియా జరిపిన అత్యంత శక్తివంతమైన క్షిపణి పరీక్ష ఇదే కాబట్టి!. క్షిపణి వార్‌హెడ్‌కు ఇన్‌స్టాల్ చేసిన కెమెరా స్పేస్ నుంచి భూమిని ఫొటోలు తీయగా.. కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఆ ఫొటోల్ని సైతం సంబురంగా రిలీజ్ చేసింది.
అయితే పనిలో పనిగా.. అగ్రరాజ్యాన్ని కవ్వించే విధంగా ప్రకటనలు చేసుకుంది. దాదాపు 2వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకొని, 800 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన అనంతరం ఈ క్షిపణి సముద్రంలో కూలింది. అయితే మిడ్ రేంజ్‌గా ప్రకటించుకున్నప్పటికీ.. ‘వాసాంగ్-12 Hwasong-12 అమెరికా గువాం తీరాన్ని(సుమారు 2,128 మైళ్ల దూరాన్ని) తాకే అవకాశం ఉందని ప్రకటించడం ద్వారా శాంతిచర్చలను పక్కనపడేసి అగ్రరాజ్యంపై కయ్యానికి కాలు దువ్వినట్లయ్యింది. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఈ స్థాయిలో పరీక్షలు జరపడం గమనార్హం.