హైదరాబాద్ కుత్బుల్లాపూర్‌లో జరిగిన భారీ పేలుడుతో జనం ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. రెండు బ్యాగులు మోసుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి జయరాంనగర్ చౌరస్తా వద్ద ఒకదానిని విసిరేశాడు. అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు శబ్దం దాదాపు కిలోమీటరు వరకు వినిపించింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న పూజాసామగ్రి దుకాణం అద్దాలు బద్దలయ్యాయి.ఏం జరిగిందో తెలియక ప్రజలు భయంతో వణికిపోయారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి చేతిలో ఉన్న మరో బ్యాగును తెరిచేందుకు బాంబ్ స్క్వాడ్‌ను రప్పించారు. అనంతరం దానిని తెరిచి చూడగా చెత్త ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని విచారించగా తనకు ఆ బ్యాగ్ బాలానగర్‌లో దొరికిందని చెప్పాడు. దానిని చూసి కుక్కలు మొరుగుతుండడంతో పడేసినట్టు చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.