కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గింది. సంస్థ అత్యున్నత అధికారులు అరెస్ట్ అయ్యే ముప్పు, జరిమానా పడే అవకాశం ఉండడంతో.. కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెట్టిన ఖాతాలను డిలీట్ చేస్తోంది. కొద్ది కాలంగా ‘రైతుల హత్యకు మోదీ కుట్ర (#ModiPlanningFarmerGenocide)’ అన్న హాష్ ట్యాగ్ తో కొందరు ట్వీట్టు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రెచ్చగొట్టేలా ఉన్న ఆ ట్వీట్లను తొలగించాలని, ఆ ఖాతాలను డిలీట్ చేయాలని ట్విట్టర్ ను ఐటీ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అయితే, ముందు ట్విట్టర్ అందుకు ఒప్పుకోలేదు. ప్రభుత్వ ఆదేశాలను ట్విట్టర్ పాటించాల్సిందేనని, లేదంటే అరెస్ట్ లను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వడంతో ఇప్పుడు స్పందించింది. ఆ హాష్ ట్యాగ్ తో 257 ఖాతాల నుంచి ట్వీట్లు వెళ్లినట్టు గుర్తించిన సంస్థ.. 126 ఖాతాలను డిలీట్ చేసినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. అంతేగాకుండా ఖలిస్థానీ, పాకిస్థాన్ గ్రూపులతో లింకులున్నట్టు కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న 1,178 ఖాతాల్లో 583 ఖాతాలను తొలగించినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ట్విట్టర్ భారత ప్రతినిధి స్పందించేందుకు నిరాకరించారు. మొత్తంగా 709 ఖాతాలను తొలగించినట్టు సమాచారం. రైతు చట్టాలపై పాప్ గాయకురాలు రిహానా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ ల ట్వీట్లు దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.