మాస్కోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నిన్న సాయంత్రం చైనా రక్షణ మంత్రి వే ఫెంఝీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పలు కీలక అంశాలను చర్చించినట్టు తెలుస్తోంది.అలాగే, లడఖ్ సరిహద్దులో నెలకొన్న తాజా ఉద్రిక్తతలపైనా వీరు చర్చించినట్టు సమాచారం. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథస్థితిని కొనసాగించాలని రాజ్‌నాథ్ కోరారు. మే నెలలో లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య ఉన్నతస్థాయి సమావేశం జరగడం ఇదే తొలిసారి.