జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం జిల్లాలోని వెస్సు ప్రాంతంలో బీజేపీ సర్పంచ్ సజ్జాద్ అహ్మద్ ఖండే ను కాల్చి చంపారు. ఆయన నివాసం బయట ఈ దారుణానికి ఒడిగట్టారు. బుల్లెట్ గాయాలతో ఉన్న సజ్జాద్ ను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే ఈ దాడికి పాల్పడినట్టు ఇంత వరకు ఏ టెర్రర్ గ్రూపు ప్రకటించుకోలేదు. పలువురు సర్పంచులతో కలిసి ఆయన సెక్యూరిటీతో కూడిన మైగ్రెంట్ క్యాంప్ లో ఉన్నారు. నిన్న ఉదయం తన స్వగ్రామానికి వెళ్లేందుకు ఆయన క్యాంపు నుంచి బయల్దేరారు. తన నివాసానికి 20 మీటర్ల సమీపంలోకి ఆయన చేరుకున్న సమయంలో టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన మెడలోకి బుల్లెట్ దూసుకుపోయింది. గత 48 గంటల్లో ఇలాంటి కాల్పుల ఘటన జరగడం ఇది రెండో సారి. 4వ తేదీన మరో బీజేపీ నేత ఆరిఫ్ అహ్మద్ పై కూడా ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ప్రస్తుతం ఆయన తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.