మంచి వీడియో చేసి టిక్‌టాక్ ద్వారా పేరు సంపాదించుకోవాలన్న తపన ఓ డిగ్రీ విద్యార్థి ప్రాణాలను బలితీసుకుంది. కర్ణాటకలోని హోసూరులో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక కేలైకుంట పార్వతీనగర్‌కు చెందిన వెట్రివేల్ (22) డిగ్రీ చదువుతున్నాడు. ఇటీవలి కాలంలో టిక్‌టాక్‌పై మోజు పెంచుకున్న ఈ యువకుడు.. ఆసక్తిగొలిపేలా ఓ వీడియో చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా బతికున్న చేపను మింగుతూ వీడియో చేశాడు. అయితే, చేప కాస్తా గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరి ఆడక గిలగిల్లాడిపోయాడు. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.