ఏపీలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. టీడీపీ ఇలా మేనిఫెస్టో విడుదల చేయడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ కె.శివరాజశేఖరరెడ్డి హైకోర్టులో పిల్ వేశారు. దీనిపై నిన్న కోర్టులో వాదనలు జరిగాయి.ఈ సందర్భంగా శివరాజశేఖరరెడ్డి తరపున న్యాయవాది శివప్రసాద్‌రెడ్డి వాదనలు వినిపించారు. మేనిఫెస్టోను ఉపసంహరించుకోవాలని టీడీపీని ఎస్‌ఈసీ సూచించింది తప్పితే ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు.స్పందించిన న్యాయస్థానం పార్టీ ప్రధాన కార్యదర్శి మేనిఫెస్టో విడుదల చేస్తే అధినేతపై చర్యలు కోరడం ఏంటని ప్రశ్నించింది. చంద్రబాబును ప్రతివాదిగా చేర్చడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. పిల్‌కు విచారణార్హత లేదంటూ జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.