ఆరోజుల్లో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. వాటిల్లో ఎక్కి ప్రయాణం చేయాలని చాలా మంది ముచ్చట పడేవారు. అయితే, కాలక్రమేణా అవి తగ్గిపోయి పూర్తిగా మాయమైపోయాయి. డబుల్ డెక్కర్ బస్సులను గుర్తు చేసుకుంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు షాకీర్ హుస్సేన్ అనే నెటిజన్ ట్వీట్ చేశాడు.అప్పట్లో ఈ బస్సులు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో ఉండేవని, జూపార్క్ నుంచి వయా హైకోర్టు, అబిడ్స్, హుస్సేన్ సాగర్, రాణిగంజ్ వంటి ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవని చెప్పాడు. మళ్లీ ఆ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని కోరాడు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ… హైదరాబాద్, అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకున్న సమయంలో డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవని గుర్తు చేసుకున్నారు.ఈ బస్సుల గురించి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. ఆ బస్సులను ఎందుకు ఆపేశారో తనకు కచ్చితంగా తెలియదని అన్నారు. ఆ బస్సులను మళ్లీ రోడ్లపైకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉందా? అని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అడిగారు.